తొలిపలుకు
మానవజాతి భవిష్యత్తు బాలలు. మంచో చెడో గతం గడిచిపోయింది. వర్తమానం ఇలా ఉంది. మనిషి నిరంతర ఆలోచన భవిష్యత్తు గురించే. భవిష్యత్తుని గురించి ప్రణాలికలు వేస్తూ దాన్ని అందిపుచ్చుకునే బాలల గురించి విస్మరించలేం.
పిల్లల అభ్యున్నతి మూడు అంశాల పైన ఆధారపడుతుంది. జ్ఞాపకశక్తి, సృజనాత్మకత, పరిసరాలు. ఈ మూడింటి నుంచి సమపాళ్ళలో పొందలేని పిల్లలు ఆ మేరకు అసమగ్రంగా మిగిలిపోతారు. దురదృష్టవశాత్తూ విద్యావిధానంలో ఏర్పడిన మూసతత్వం వల్ల, ఎక్కువ మార్కులు సాధించడమే పిల్లవాడి ప్రతిభకు గీటురాయి కావడం వల్ల, మనం జ్ఞాపకశక్తికి ఇస్తున్న ప్రాధాన్యం మిగిలిన అంశాలకు ఇవ్వడం లేదు. దీనివల్ల పిల్లలలో సృజనాత్మకత తగ్గిపోతోంది. సమాజం నుంచి, పరిసరాల నుంచి నేర్చుకోగలిగింది కూడా వెనకబడిపోతుంది. వేగంగా నగరీకరణ చెందడం, ప్రకృతితో సంబంధం తెగిపోవడం, సమష్టి తత్వానికి దూరం కావడం ఇవన్నీ ముందుతరాలకు నష్టం కలిగించే అంశాలు.
జీవనశైలులు మారుతున్న నేపథ్యంలో పిల్లలు మూడవ ఏడు ప్రవేశిస్తూనే బడి ప్రవేశం కూడా చేస్తున్నారు. అక్కడినుండి గ్రాడ్యుయేషన్ అయ్యేంత వరకూ అంటే దాదాపు 17, 18 సంవత్సరాలు విద్యాలయాల్లోనే గడిపేస్తున్నారు. విద్యాబోధనతో పాటు వారిలోని సృజనాత్మక శక్తులను గుర్తించి పెంపొందించడం, వారి సమగ్ర వ్యక్తిత్వ వికాసానికి దోహదం చేయడం నేటి విద్యాసంస్థల బాధ్యత. ఆధునిక ఎలక్షానిక్ పరికరాలు విద్యార్థులకు అందుబాటులో రావడం వల్ల పిల్లల ఆలోచనపై ఏయే అంశాలు ఎలాంటి ప్రభావాలు ఎంత మేరకు చూపుతున్నాయో అంచనా వేయడం కష్టంగా మారింది. ఒక్కొక్క విద్యార్థిని ఒక ప్రత్యేకమైన అంశంగా పరిగణించాల్సిన పరిస్థితి ఏర్పడింది. సమాజంలో రూపు దిద్దుకుంటున్న వ్యక్తితత్వం పిల్లల్లో కూడా ప్రతిఫలిస్తోంది.
ఆరోగ్యకరమైన సమష్టి తత్వాన్ని పెంపొందించడానికి సామాజికులు ఒక చోట చేరడం అవసరమని మన ప్రాచీనులు ఏనాడో గుర్తించారు. దైనందిన జీవన కార్యకలాపాలకు విశ్రాంతినిచ్చి ఉత్సాహవూరిత వాతావరణంలో పదిమందీ కలిసి తమ అనుభవాల్నీ, అనుభూతుల్ని పంచుకోవడాన్ని ఉత్సవం అన్నారు. ఉత్సవాల నిర్వహణ వల్ల సామాజిక దృక్పథం మెరుగుపడడాన్ని గమనించారు.
వివిధ ప్రాంతాల నుంచి, విభిన్న నేపథ్యాల నుంచి, బహుళ సంస్కృతుల నుంచీ ఎదుగుతున్న పిల్లలందరూ ఒక్కచోట చేరి ఒక ఉత్సవం జరిపినవుడు ఆదాన వ్రదానాల వలన విద్యార్థుల్లో సృజనాత్మకత పెరిగేందుకు అవకాశం ఉంటుందని, పోటీతత్వం వలన చొరవ, చురుకుదనం పెరుగుతాయని ఆశిస్తున్నాం.
అయితే ఇలాంటి ప్రయత్నం తెలుగు రాష్ట్రాల్లో ఇంతకు ముందు కొత్తగూడెంలో బాలోత్సవ్ పేరుతో జరిగింది. వారు పాతికేళ్ళుగా చేస్తున్న ఉత్సవాన్ని 2016లో రజతోత్సవం జరిపి విరామ మిచ్చారు. ఇలాంటి ఉత్సవాలు ఆగకూడదు. అందుకే వివిఐటి ఆ బాధ్యతని 2017వ సంవత్సరంలో అందిపుచ్చుకుని వివిఐటి బాలోత్సవ్-2017, వివిఐటి బాలోత్సవ్-2018, వివిఐటి బాలోత్సవ్-2019 మరియు వివిఐటి బాలోత్సవ్-2022 ను అత్యంత వైభవంగా నిర్యహించుకున్నాము. దేశం నలుమూలలనుంచి సుమారుగా 700 పాఠశాలలకు చెందిన విద్యార్థులు అత్యధిక సంఖ్యలో పాల్గొని వివిఐటి బాలోత్సవ్‌ను విజయవంతం చేశారు.
అదే విధంగా ఈ సంవత్సరం వివిఐటిబాలోత్సవ్ 2023లో 20 అంశాలు 61 విభాగాలలో పోటీలను నిర్వహించదలిచాము.
ప్రాచీన కాలం నుండి భారతదేశం వసుధైవ కుటుంబ భావనని ప్రోత్సహించింది. ప్రపంచం అంతా ఒకే కుటుంబం అయినప్పటికీ భిన్నమైన ఆచార సంప్రదాయాలు, భాషలు, సంస్కృతులు ఈ వసుథైవ కుటుంబ భావనను పలు వర్ణాలుగా ప్రతిబింబిస్తున్నాయి. భిన్నత్వంలో ఏకత్వం అనేది వసుధైవ కుటుంబానికి మూలసూత్రం. ఆ విధంగా ప్రతి జాతి తమదైన సంస్కృతి, సంప్రదాయాలను, భాషను ఉచ్చస్థితికి తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. తెలుగు ప్రజల విశిష్టత, ప్రాధాన్యత గణనీయమైనది. కనుక తమదైన భాషాసంప్రదాయాలను కాపాడుకుంటూ ముందు తరాలకు అందించాల్సిన అవసరం ఉంది. ఇదొక మహా సంకల్పం. దేశంలోని పలు రాష్ట్రాల్లోనే కాక ప్రపంచంలో అనేక దేశాల్లో విస్తరించి ఉన్న తెలుగు కుటుంబాల బాలలందరి నుంచి ఈ ఉత్సవానికి ప్రాతినిధ్యం వచ్చి, ఈ ఉత్సవం ఎఏటికేడాది విస్తరించి తెలుగు బాలల్లో వసుధైవ కుటుంబ భావనను పెంపొందేందుకు దోహదపడాలని మా ఆశయం. మా ఆశయాలను, భావాలను అర్ధం చేసుకొని పాఠశాలల యాజమాన్యాలు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, ప్రభుత్వాధికారులు, ఎలక్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వారు, మరెందరో మహానుభావులు అందరు మాకు సహకరించి వివిఐటి-బాలోత్సవ్ ను విజయవంతంగా జరగడానికి తోడ్పడుతున్నారు.
దేశం నలుమూలల నుండి వేలాది మంది, బాలబాలికలు ఆ మూడు రోజులు వివిఐటి ఉద్యానవనంలో అతిథి సీతాకోకచిలుకల్లా విహరించి ప్రాంగణాన్ని శోభాయమానం చేశారు. అందరికి మా కృతజ్ఞతలు. పోటీలో బహుమతులకన్నా పాల్గొనటమే మిన్న అనుకుంటూ తరగని ఉత్సాహంతో వచ్చిన పిల్లలందరికి అభినందనలు.
వివిఐటి బాలోత్సవ్ – 2024 లో ఆనందోత్సహాలతో పాల్గొని ఈ ప్రపంచ తెలుగుబాలల పండుగను విజయవంతం చేయాలని మిమ్మల్నందరిని వివిఐటికి సాదరంగా ఆహ్వానిస్తున్నాం.
- వాసిరెడ్డి విద్యాసాగర్
చిరునామా
వాసిరెడ్డి వెంకటాద్రి ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ,
నంబూరు గ్రామం, పెదకాకాని మండలం, గుంటూరు జిల్లా
ఆంధ్రప్రదేశ్ - 522508
ఇమెయిల్
vvitbalotsav@gmail.com
ఫోన్ నెంబర్
+91 73862 25336