తొలిపలుకు

"ఇదొక మహా సంకల్పం. దేశంలోని పలు రాష్ట్రాలే కాక ప్రపంచం నలుమూలలా ఉన్న తెలుగు బాలలందరి నుంచీ ప్రాతినిధ్యం వచ్చేలా ప్రయత్నిస్తున్నాం"

మానవజాతి భవిష్యత్తు బాలలు. మంచో చెడో గతం గడిచిపోయింది. వర్తమానం ఇలా ఉంది. మనిషి నిరంతర ఆలోచన భవిష్యత్తు గురించే. భవిష్యత్తుని గురించి ప్రణాళికలు వేస్తూ దాన్ని అందిపుచ్చుకునే బాలల గురించి విస్మరించలేం.

పిల్లల అభ్యున్నతి మూడు అంశాల పైన ఆధారపడుతుంది. జ్ఞాపకశక్తి, సృజనాత్మకత, పరిసరాలు. ఈ మూడింటి నుంచి సమపాళ్ళలో అందుకోలేని పిల్లలు ఆ మేరకు అసమగ్రంగా మిగిలిపోతారు. దురదృష్టవశాత్తూ విద్యావిధానంలో ఏర్పడిన మూసతత్వం వల్ల, ఎక్కువ మార్కులు సాధించడమే పిల్లవాడి ప్రతిభకు గీటురాయి కావడం వల్ల మనం జ్ఞాపకశక్తికి ఇస్తున్న ప్రాధాన్యం మిగిలిన అంశాలకు ఇవ్వడం లేదు. దీనివల్ల పిల్లలలో సృజనాత్మకత తగ్గిపోతోంది. సమాజం నుంచి, పరిసరాల నుంచి నేర్చుకోగలిగింది కూడా వెనకబడిపోతోంది. వేగంగా నగరీకరణ చెందడం, ప్రకృతితో సంబంధం తెగిపోవడం, సమిష్ఠి తత్వానికి దూరం కావడం ఇవన్నీ ముందుతరాలకు నష్టం కలిగించే అంశాలు.

జీవనశైలులు మారుతున్న నేపధ్యంలో పిల్లలు మూడవ ఏడు ప్రవేశించడంతోనే బడి ప్రవేశం కూడా చేస్తున్నారు. అక్కడినుండి గ్రాడ్యుయేషన్ అయ్యేంత వరకూ అంటే దాదాపు 17, 18 సంవత్సరాలు విద్యాలయాల్లోనే గడిపేస్తున్నారు. విద్యాబోధనతో పాటు వారిలోని సృజనాత్మక శక్తులను గుర్తించి పెంపొందించడం వారి సమగ్ర వ్యక్తిత్వ వికాసానికి దోహదం చెయ్యాల్సి రావడం నేటి విద్యాసంస్థల బాధ్యతగా పరిణమించింది. ఆధునిక ఎలక్ట్రానిక్ పరికరాలు విద్యార్ధులకు అందుబాటులో రావడం వల్ల పిల్లల ఆలోచనపై ఏయే అంశాలు ఎలాంటి ప్రభావాలు ఎంత మేరకు చూపుతున్నాయో అంచనా వేయడం కష్టంగా మారింది. ఒక్కొక్క విద్యార్ధినీ ఒక ప్రత్యేకమైన అంశంగా పరిగణించాల్సిన పరిస్థితి ఏర్పడింది. సమాజంలో రూపు దిద్దుకుంటున్న వ్యక్తి తత్వం పిల్లల్లో కూడా ప్రతిఫలిస్తోంది.

ఆరోగ్యకరమైన సమిష్ఠి తత్వాన్ని పెంపొందించడానికి సామాజికులు ఒక చోట చేరడం అవసరమని మన ప్రాచీనులు ఏనాడో గుర్తించారు. దైనందిన జీవన కార్యకలాపాలకు విశ్రాంతినిచ్చి ఉత్సాహపూరిత వాతావరణంలో పదిమందీ కలిసి తమ అనుభవాల్నీ, అనుభూతుల్నీ పంచుకోవడాన్ని ఉత్సవం అన్నారు. ఉత్సవాల నిర్వహణ వల్ల సామాజిక దృక్పధం మెరుగుపడడాన్ని గమనించారు.

వివిధ ప్రాంతాల నుంచి, విభిన్న నేపధ్యాల నుంచి, బహుళ సంస్కృతుల నుంచీ ఎదుగుతున్న పిల్లలందరూ ఒక్కచోట చేరి ఒక ఉత్సవం జరిపినపుడు ఆదాన ప్రదానాల వలన విద్యార్ధుల్లో సృజనాత్మకత పెరిగేందుకు అవకాశం ఉంటుందని, పోటీతత్వం వలన చొరవ, చురుకుదనం పెరుగుతాయని ఆశిస్తున్నాం.

అయితే ఇలాంటి ప్రయత్నం తెలుగు రాష్ట్రాల్లో ఇంతకూ ముందు కొత్తగూడెంలో బాలోత్సవ్ పేరుతో జరిగిందని తెలిసిందే. వారు పాతికేళ్ళుగా చేస్తున్న ఉత్సవాన్ని పోయినేడు రజతోత్సవం జరిపి విరామమిచ్చారని తెలిసింది. ఇలాంటి ఉత్సవాలు ఆగకూడదు. అందుకే VVIT ఆ బాధ్యతని అందిపుచ్చుకుంది. మొత్తం 20 అంశాలలో 42 విభాగాలలో దేశం నలుమూలల నుండి సుమారుగా 700 పాఠశాలలకు చెందిన 12 వేల మంది పైచిలుకు విద్యార్ధులతో వివిఐటి బాలోత్సవ్ 2017, 2018 లను అత్యంత వైభవంగా నిర్వహించుకున్నాము. అదే విధంగా ఈ సంవత్సరం వివిఐటి బాలోత్సవ్ 2019లో మొత్తం 18 అంశాలలో 60 విభాగాలలో పోటీలు నర్సరీ నుండి పదవ తరగతి వరకు గల విద్యార్ధుల మధ్య నిర్వహించబడతాయి.

 

ప్రాచీన కాలం నుండి భారతదేశం వసుదైక కుటుంబ భావనని ప్రోత్సహించింది. ప్రపంచం అంతా ఒకే కుటుంబం అయినప్పటికీ భిన్నమైన ఆచార సాంప్రదాయాలు, భాషలు, సంస్కృతులు ఈ వసుదైక కుటుంబ భావనను పలు వర్ణాలుగా ప్రతిబింబిస్తున్నాయి. భిన్నత్వంలో ఏకత్వం అనేది వసుదైక కుటుంబానికి మూలసూత్రం. ఆ విధంగా ప్రతిజాతి తమదైన సంస్కృతి, సాంప్రదాయాలను, భాషను ఉచ్ఛస్థితికి తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. తెలుగు ప్రజల విశిష్టత, ప్రాధాన్యత గణనీయమైనది. కనుక తమదైన భాషా సాంప్రదాయాలను కాపాడుకుంటూ ముందు తరాలకు అందించాల్సిన అవసరం ఉంది.

ఇదొక మహా సంకల్పం. దేశంలోని పలురాష్ట్రాల్లోనే కాక ప్రపంచంలో అనేక దేశాల్లో విస్తరించి ఉన్న తెలుగు కుటుంబాల బాలలందరి నుంచీ ఈ ఉత్సవానికి ప్రాతినిధ్యం వచ్చేలా ఆంధ్రప్రదేశ్ ప్రవాసాంధ్ర సంఘం (APNRT) సహకరిస్తోంది. ఈ ఉత్సవం ఏటికేడాది విస్తరించి తెలుగు బాలల్లో వసుదైక కుటుంబ భావన  పెంపొందేందుకు దోహదపడాలని మా ఆశయం. మా ఆశయాలని, భావాలని అర్ధం చేసుకుని పాఠశాలల యాజమాన్యాలు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, ప్రభుత్వాధికారులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వారు, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వారు, మరెందరో మహానుభావులు అందరు మాకు సహకరించి వివిఐటి బాలోత్సవ్ 2017ని విజయవంతం చేశారు. సుమారు పన్నెండు వేల మంది బాలబాలికలు ఆ మూడు రోజులు వివిఐటి ఉద్యానవనంలో సీతాకోకచిలుకల్లా విహరించి ప్రాంగణాన్ని శోభాయమానం చేశారు. అందరికీ మా కృతఙ్ఞతలు.

పోటీలో బహుమతులకన్నా పాల్గొనడమే మిన్న అనుకుంటూ తరగని ఉత్సాహంతో వచ్చిన పిల్లలందరికీ అభినందనలు.

నవంబరు 28 నుండి నవంబరు 30 వరకు జరగబోతున్న బాలోత్సవ్ - 2019 ని కూడా అదేవిధంగా ఆనందోత్సాహాలతో పాల్గొని మీ పండుగను విజయవంతం చేయాలని మిమ్మల్నందరినీ వివిఐటికి సాదరంగా ఆహ్వానిస్తున్నాం.

-వాసిరెడ్డి విద్యాసాగర్